జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత ప్రకటన
అమరావతి – వైఎస్సార కడప జిల్లా దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం పట్ల జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పొలం లోనే రైతు నాగేంద్ర , భార్య వాణి, కొడుకు భార్గవ్, కూతురు గాయత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రైతు కుటుంబం ఆత్మహత్యపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఇన్చార్జి ఎస్పీ విద్యా సాగర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడామన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు మంత్రి సవిత.
ప్రభుత్వ పరంగా సహకారం అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని రైతులకు మెరుగైన పథకాలను అమలు చేస్తున్నామని, ఏదైనా సమస్య ఉంటే తమకు తెలియ చేయాలని సూచించారు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడడం మంచిది కాదన్నారు.
అప్పులు ఉంటే తీర్చుకోవచ్చని, కానీ ప్రాణం పోతే తిరిగి తీసుకు రాలేమన్నారు మంత్రి సవిత. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తాము చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయ రంగాన్ని గత సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ తాము వచ్చాక దానిని పండుగ చేస్తున్నామని చెప్పారు .
ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందనే దానిపై పూర్తిగా విచారణకు ఆదేశించామన్నారు. నివేదిక వచ్చాక విషయాలు వెల్లడిస్తామన్నారు సవిత.