మంత్రి దాసరి సీతక్క
వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో జరిగిన సభలో ప్రసంగించారు మంత్రి దాసరి సీతక్క. తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. ప్రజా పాలన కొనసాగుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకు రావడంలో సీఎం కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తమ ప్రభుత్వం పూర్తిగా విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం పైనే దృష్టి సారించిందన్నారు. పేదరికం లేకుండా చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.
ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు, రూ.5.5 కోట్లతో ఘన్‌ఫూర్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు, రూ.45.5 కోట్లతో ఘన్‌ఫూర్‌లో 100 పడకల ఆస్పత్రికి, రూ.26 కోట్లతో ఘన్‌ఫూర్‌లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ పూర్తి చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారు.