దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి
మంత్రి దాసరి సీతక్క డిమాండ్
మంత్రి సీతక్క భగ్గుమన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవమైన భారత రాజ్యాంగ రూప శిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేసిన షాపై ఫైర్ అయ్యారు. వెంటనే దేశ ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పి తీరాలన్నారు సీతక్క.
ఈ దేశంలో అదానీ, మోదీ, బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటున్నారని, ఈ ప్రజాస్వామిక దేశంలో చెల్లదని అన్నారు. ఇంకోసారి అంబేద్కర్ ను కానీ రాజ్యాంగాన్ని కానీ చులకన చేసి మాట్లాడితే దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఇది గమనించాలని హెచ్చరించారు దాసరి సీతక్క.
ప్రతీ పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పారు. ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించేందుకు తమ పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు. కానీ బీజేపీ మాత్రం మను స్మృతిని తిరిగి తీసుకు రావాలని అనుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం వ్యాపారులకే వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తే చరిత్ర క్షమించదన్నారు. ఇకనైనా మోడీ, షా ఇది గుర్తిస్తే మంచిదని హితవు పలికారు.