బండి సంజయ్ పై భగ్గుమన్న మంత్రి
హైదరాబాద్ – రాహుల్ గాంధీది ఏ మతం, ఏ కులం అంటూ నోరు పారేసుకున్న మంత్రి బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు మంత్రి దాసరి సీతక్క. రాహుల్ గాంధీ మతం, అభిమతం కుల గణన మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉందన్నారు. తమ పార్టీ ఉద్దేశం, లక్ష్యం ఒక్కటేనని అది దేశానికి మంచి పాలన అందించడమేనని పేర్కొన్నారు.
అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చేందుకే తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ నేతలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గత 30 ఏళ్లుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పని చేస్తున్నారని చెప్పారు సీతక్క. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పని చేస్తున్నారని చెప్పారు.