నిప్పులు చెరిగిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ – మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పై. తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ దుష్ప్రచారానికి తెర లేపారంటూ మండిపడ్డారు. కలిసి భోజనం చేయడం కూడా తప్పా అని ప్రశ్నించారు. సర్కార్ ను బద్నాం చేసే పనిలో బిజీగా ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు పూర్తిగా అబద్దమన్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేయడంలో దిట్ట అంటూ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పెంచి పోషిస్తున్న మీడియా కావాలని ఇలాంటి ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యేలు కలిసి కూర్చోవడం సహజమేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఎంత సేపు తనంతకు తానుగా గొప్ప నాయకుడినంటూ భావిస్తున్నారంటూ మండిపడ్డారు.
అధికారం పోయిందన్న బాధలో ఉన్నాడని, అందుకే ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడని సెటైర్ వేశారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఇదే సమయంలో కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025పై స్పందించారు. కావాలని తమ రాష్ట్రంపై కక్ష కట్టారంటూ ఆరోపించారు. కేంద్రంలో మంత్రులుగా కొలువు తీరిన బండి సంజయ్ కుమార్ పటేల్, గంగాపురం కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.