Saturday, April 5, 2025
HomeNEWSANDHRA PRADESHఫైళ్ల ద‌గ్దం వెనుక పెద్దిరెడ్డి హ‌స్తం

ఫైళ్ల ద‌గ్దం వెనుక పెద్దిరెడ్డి హ‌స్తం

హోం మంత్రి వంగలపూడి అనిత

అమ‌రావ‌తి – మంత్రి వంగ‌ల‌పూడి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని ఆరోపించారు. సబ్ కలెక్టక్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లను దగ్ధం చేసిన కేసులో ఇప్పటికే ఆర్డీవో మురళీ, కొత్త ఆర్డీవో హరిప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌పై ప్రాథమిక విచారణ జ‌రిపామ‌న్నారు. అనంతరం సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ నేతృత్వంలో వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు.

శాసనమండలిలో ఎంఎల్సీలు తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్ బాబు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి బదులిచ్చారు. ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజ్ సహా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులైన పీఏ తుకారం, మాధవ్ రెడ్డి తదితరులను ఏ1, ఏ2, ఏ3గా పేర్కొంటూ విచారణ జరుగుతుందన్నారు.

పాత ఆర్డీవో మురళీ నేతృత్వంలో అసైన్డ్ ల్యాండ్ 79,107 ఎకరాలను ఫ్రీ హోల్డ్ కింద 22ఏ రికార్డుల నుంచి బయటకి విడుదల చేసినట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ స్థాయిలో పునర్విచారణ నేపథ్యంలో 22,523 ఎకరాల భూమి విషయంలో నిబంధనలు అతిక్రమించినట్లు తేలిందన్నారు. దీనిపై ప్రాథమిక నివేదిక వచ్చిందని అధికారిక నివేదిక కూడా రావాల్సి ఉందన్నారు.

అగ్ని ప్రమాదం వెనుక దాగి ఉన్న అసలు కుట్రలను కూటమి ప్రభుత్వం బయట పెట్టడం జరిగిందన్నారు. అక్రమంగా భూమిని ఆక్రమించాలనుకుని నిబంధనలను అతిక్రమించిన పెద్దిరెడ్డి అండ్ కో కుట్ర వల్లే అగ్నిప్రమాదం జరిగిందన్నారు. మదనపల్లి ఆర్డీవో ఆఫీస్ లో ఫైళ్లను దగ్ధం చేయగలరేమోగానీ నిజాల్ని చెరపలేరని హోంమంత్రి అన్నారు. తప్పు చేసిన వారిని, అందుకు సహకరించిన వారిని వదలబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments