అమలు చేస్తామన్న మంత్రి
అమరావతి – నేరం జరిగిన 100 రోజుల్లోనే శిక్ష పడేలా చేస్తామన్నారు మంత్రి వంగలపూడి అనిత. ప్రజలు, పోలీసుల భాగస్వామ్యంతో లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. సివిల్ ఇండోర్, అవుట్ డోర్ విభాగాల శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ఎస్సైలను మెడల్, సర్టిఫికెట్, చీఫ్ మినిస్టర్ పిస్టల్ తో సత్కరించారు. ఏపీఎస్పీ విభాగాల్లోని ఇండోర్, అవుట్ డోర్, ఫైరింగ్ లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరచిన ఎస్సైలను అభినందించారు. ప్రజల భద్రత విషయంలో పోలీసుల పాత్ర వెల కట్టలేనిదన్నారు. 394 మంది ఎస్సైలు శిక్షణ పూర్తి చేసుకోవడం హోంశాఖకు అదనపు బలం చేకూరుతుందన్నారు.
శిక్షణలో పాల్గొని కష్టాలను లెక్క చేయకుండా అత్యుత్తమ ప్రతిభ చాటిన అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మంత్రి. మీ కుటుంబ సభ్యురాలిగా మీరు సాధించిన విజయంపట్ల గర్విస్తున్నానని అన్నారు వంగలపూడి అనిత. పోలీస్ శాఖలో ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి పోలీస్ నా తోబుట్టువుతో సమానం అన్నారు.
ఆర్మీ, పోలీస్ విభాగాలకు పంపే కుటుంబాల త్యాగం అనిర్వచనీయమన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించే పోలీసులకు రుణపడి ఉన్నామన్నారు. ఖాకీ చొక్కా వేసుకోవడం గర్వంతో పాటు బాధ్యత కూడా అన్నారు. ప్రజలకు కష్టమొస్తే దేవుడి తర్వాత పోలీసుల దగ్గరకు వస్తారని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని సైబర్ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు.