స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – మహిళా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వంగలపూడి అనిత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఇబ్బందులు ఉండేవని కానీ ఇప్పుడు అన్ని రంగాలలో మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. నేల నుంచి నింగి దాకా శ్రామికుల నుంచి రోదసీలో వ్యోమగాముల దాకా మహిళలు చేయని పని అంటూ ఏదీ లేదన్నారు. ఇవాళ క్రీడా రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. ఇటు రాష్ట్రానికి అటు దేశానికి పేరు తీసుకు వస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాల పనితీరు గొప్పగా ఉందన్నారు.
మహిళల నాయకత్వం- సవాళ్లు పురోగమించే మార్గాలపై చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వంగలపూడి అనిత. మహిళలు ఎందులోనూ తక్కువ కాదన్నారు. ఇవాళ ప్రతి రంగంలో కీలకమైన పదవులను నిర్వహిస్తున్న ఘనత మనకే చెందిందన్నారు. తాను కూడా మహిళనేనని, ఒకప్పుడు చదువు కోసం చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. కష్టపడి టీచర్ అయ్యానని, ప్రజల కోసం సేవ చేసేందుకని రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. చంద్రబాబు నాయుడు సహకారం వల్ల ఇవాళ తాను మంత్రిగా పని చేస్తున్నట్లు తెలిపారు వంగలపూడి అనిత. ఎక్కడా నిరాశకు లోను కావద్దన్నారు.