ఖాకీల నిర్వాకం మంత్రి ఆగ్రహం
విచారణకు ఆదేశించిన అనిత
అమరావతి – మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. పల్నాడు జిల్లా మాచర్లలో కానిస్టేబుల్, హోంగార్డులు కొట్టుకున్నారు. మద్యం మత్తులో హోంగార్డుపై దాడి చేశాడు ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వెంటనే ఘటనకు సంబంధించి ఆరా తీశారు . సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
భాద్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉండి క్రమశిక్షణ కోల్పోయి ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత. వృత్తి పట్ల నిబద్దతతో పని చేయాలే తప్పా ఇలా కంట్రోల్ తప్పి రచ్చ చేయడం మంచి పద్దతి కాదన్నారు.
శాఖా పరంగా ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన వాళ్లు ఇలా బజారు కెక్కడం దారుణమన్నారు. అసలు ఎస్పీ ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. వెంటనే దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత.
ఇదిలా ఉండగా శాఖా పరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ ద్వారకా తిరుమల రావు. మరోసారి ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు.