మంత్రి వంగలపూడి అనిత ప్రకటన
అమరావతి – ఏపీలో తొలి కొకైన్ కేసు నమోదైంది వైసీపీ పాలనలోనేనని అన్నారు మంత్రి వంగలపూడి అనిత. దృష్టి పెట్టక పోవడం వల్లనే దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. తాము వచ్చాక ఉక్కుపాదం మోపామని చెప్పారు. ఇందుకు సంబంధించి నిఘా కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వంలో 70 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. 3 గంజాయి కేసులలో ఇప్పటికే ఆస్తుల జప్తును అమలు చేశామన్నారు. డాక్టర్ ప్రిస్క్పిక్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మితే మెడికల్ షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పాఠశాల స్థాయి లోనే అవగాహన చర్యలు చేపట్టామన్నారు వంగలపూడి అనిత. ఓటీటీ, రీల్స్ లో విష ప్రచారం పట్ల ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసే సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. రూ.10 కోట్ల కార్పస్ నిధితో సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అమాయక గిరిజన యువకులకు శిక్ష పడకుండా అవగాహన పెంచుతామన్నారు. సరిహద్దు రాష్ట్రాలతో గంజాయి నిర్మూలనపై త్వరలో అంతర్గత సమావేశం చేపడతామన్నారు అనిత వంగలపూడి.
గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా ఉనికి లేకుండా చేస్తామని ఆమె స్పష్టం చేశారు. దీని కోసమే 30 శాతం ఫిట్ మెంట్ సహా టెక్నాలజీ గురించి తెలిసిన అధికారులు, అత్యాధునిక డ్రోన్లు, సీసీ కెమెరాలతో పటిష్ట ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ద్వారా విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు. గంజాయి సాగును 90 శాతం తగ్గించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. గంజాయి కేసుల్లో వైసీపీ పాలనలో 1,995 మందిని అరెస్ట్ చేయగా.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలంలోనే 2,513 మందిని అరెస్ట్ చేసిందని గణాంకాలతో సహా వివరించారు.