బాధితులను పరామర్శించిన అనిత
మరో ఘటన చోటు చేసుకున్న వైనం
విశాఖపట్టణం జిల్లా – అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురంలో చోటు చేసుకున్న పేలుడు ఘటన మరిచి పోక ముందే ..కొన్ని గంటల తేడాలో మరో ఘటన చోటు చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థ లో ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో పెను ముప్పు తప్పింది. అయితే పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అక్కడి నుండి క్షతగాత్రులను విశాఖ పట్టణం నగరంలోని ఇండస్ ఆస్పత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆస్పత్రికి విచ్చేశారు.
బాధితులను పరామర్శించారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు హోం శాఖ మంత్రి. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇండస్ ఆస్పత్రి యాజమాన్యాన్ని, డాక్టర్లను ఆదేశించారు.
బాధితులు త్వరగా కోలుకునేలా వైద్య సేవలు అందించాలని సూచించారు. వరుస ప్రమాద ఘటనలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు మంత్రి వంగలపూడి అనిత. వీటిపై ఇప్పటికే సీఎం విచారణకు ఆదేశించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ప్రకటించామన్నారు.