మంత్రి వాసంశెట్టి సుభాష్
విజయవాడ – డ్రగ్స్ మహమ్మారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ముఖ్యంగా హోం మంత్రి అనిత సారధ్యంలో ఈగల్ టీం ఈ విషయంలో చెండాడుతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గత ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణను పూర్తిగా విస్మరించిందన్నారు. విజయవాడలో సమీరా ఫిలిమ్స్ నిర్మించిన డార్క్ డీల్స్ చిత్రం ట్రైలర్ ను ఆవిష్కరించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలం కావడంతో యువత చెడు మార్గం పట్టిందన్నారు. చంద్రబాబు నేతృత్వంలో డ్రగ్స్ పై ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఆ ఆనవాళ్లు కనిపించినా వెంటనే ఈగల్ టీం అక్కడికి వాలిపోతోందని, చర్యలు తీసుకుంటుందన్నారు.
గురువారం చిత్ర నిర్మాత కసునూరి మౌలాలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. డార్క్ డీల్స్ వంటి సినిమాల వల్ల యువత లో చైతన్యం పెరిగి డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారని, ఈ చిత్రం యువతలో ఆలోచనకు దారి తీసే విధంగా ఉందని చెప్పారు. యువతలో చైతన్యం స్ఫూర్తి కలిగించే ఇలాంటి సినిమాలు రానున్న రోజుల్లో ఎన్నో రావాలని కోరుతూ ఈ చిత్రం నిర్మించిన చిత్ర యూనిట్ ని మంత్రి వాసంశెట్టి అభినందించారు. అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చెడు దారిలో నడుస్తున్న యువతను సక్రమంగా తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు .