బెంబెలేత్తించిన మిచెల్ స్టార్క్
హైదరాబాద్ బ్యాటర్లు విలవిల
చెన్నై – ఐపీఎల్ 2024 ఫైనల్ కథ ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును మట్టి కరిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ 18.1 ఓవర్లలోనే పరుగులు చేయలేక చతికిల పడింది. కేవలం 113 పరుగులు చేసి ఆలౌటైంది.
ప్రధానంగా కోల్ కతా బౌలర్లు మిచెల్ స్టార్క్ , ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లు కళ్లు చెదిరే బంతులతో కట్టడి చేశారు బ్యాటర్లను. ఏ కోశాన ఆడనీయకుండా చేశారు. కనీసం డిఫెన్స్ ఆడేందుకు సైతం తడబడ్డారు. విచిత్రం ఏమిటంటే నిన్నటి దాకా టోర్నీలో ప్రత్యర్థుల జట్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ , క్లాసెన్ , నితీశ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు బెంబేలెత్తి పోయారు.
ఆడ లేక తమ వికెట్లను సమర్పించుకున్నారు. వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. ప్రధానంగా తొలి ఓవర్ లోనే హైదరాబాద్ కు షాక్ ఇచ్చాడు మిచెల్ స్టార్క్. మిస్సైల్ లాంటి బంతిని విసిరి అభిషేక్ శర్మ వికెట్లను కూల్చాడు.
భారీ అంచనాలు తలకిందులుగా మార్చేశాడు స్టార్క్. తొలి బంతి నుంచే వేట మొదలు పెట్టాడు. తీవ్రంగా ఒత్తిడి పెంచాడు. దీంతో బ్యాటర్లు ఏమీ చేయలేక పోయారు. రన్స్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు నిరాశ పరిచారు.
పరుగుల వరద పారించిన సన్ రైజర్స్ కోల్ కతా దెబ్బకు తల వంచింది. ఫైనల్ లో ఓటమి పాలైంది. మిచెల్ ఓ వైపు చెలరేగితే మరో వైపు ఆండ్రీ రస్సెల్ ఏకంగా 3 వికెట్లు తీశాడు.