మోదీ మోసం నిధులు అబద్దం
నిప్పులు చెరిగిన సీఎం స్టాలిన్
తమిళనాడు – పార్లమెంట్ ఎన్నికల వేళ తాము భారీ ఎత్తున నిధులను తమిళనాడుకు ఇచ్చామని ప్రకటించిన కేంద్రంపై, ప్రధాని మోదీపై తీవ్ర స్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఎంకే స్టాలిన్. చెప్పినవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు.
గత 10 ఏళ్ల పాలనలో బీజేపీ సర్కార్ తమిళనాడు రాష్ట్రానికి రూ. 10.76 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందనేది పూర్తిగా అబద్దమని స్పష్టం చేశారు. కేంద్ర సర్కార్ నేరుగా రాష్ట్ర సర్కార్ కు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయని తెలిపారు. యూపీకి 18.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆరోపించారు ఎంకే స్టాలిన్. అనేక లక్షల రూపాయలు పన్నుల రూపేణా చెల్లించిన తమిళనాడుకు రూ. 5.5 లక్షల కోట్ల రూపాయలను మాత్రమే అందించిందని ఆరోపించారు.
ఒక్క ఇటుక కూడా వేయని మధురై ఎయిమ్స్ రూ. 1,960 కోట్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు సీఎం. రూ. 63,246 కోట్ల అంచనాతో చేపట్టబోయే చెన్నై మెట్రో రైలు రెండో దశ పనులకు ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు ఎంకే స్టాలిన్. సాగరమాల ప్రాజెక్టుకు రూ. 2 లక్షల కోట్లు అబద్దమన్నారు.
తమిళనాడులో గత పదేళ్లలో ఈ పథకాల కింద ఎంత డబ్బు ఖర్చు చేశారు, ఎంత నిధులు విడుదల చేశారో వివరించేందుకు బీజేపీ మంత్రులెవరైనా ముందుకు వస్తారా అని సవాల్ విసిరారు సీఎం. కేంద్రం అబద్దాలను భరించే స్థితిలో తమిళులు లేరన్నారు.