కేంద్రం ఆమోదం స్టాలిన్ ఆగ్రహం
ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుపై ఫైర్
తమిళనాడు – ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మోడీ కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. దీనిపై సీరియస్ గా స్పందించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. సమాఖ్య భావనకు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమని మండిపడ్డారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు సీఎం.
గురువారం ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లుగా రాచరిక పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతర వేసేందుకు ఈ బిల్లును తీసుకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఉన్న సంబంధాలను తెంచే విధంగా , పవర్స్ లేకుండా చేసేలా కుట్ర పన్నారంటూ ఆరోపించారు ఎంకే స్టాలిన్.
మోడీ నియంతృత్వపు ధోరణలు చెల్లుబాటు కావంటూ స్పష్టం చేశారు. తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు . ఇండియా కూటమిలోని ప్రతి పార్టీ దీనిని బేషరతుగా వ్యతిరేకిస్తుందని అన్నారు. దేశ వ్యాప్తంగా తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు పీఎం నరేంద్ర మోడీని. ఇంకెంత కాలం ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య స్పూర్తిని కాలరాస్తారంటూ నిప్పులు చెరిగారు ఎంకే స్టాలిన్.