అధికార దుర్వినియోగంపై ఫైర్
తమిళనాడు – రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. డీఎంకే వర్సెస్ బీజేపీగా మారి పోయింది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి తెర లేపారు. ఈ తరుణంలో డీఎంకే చీఫ్ , సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. తమ మంత్రివర్గంలో సహచరుడిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని సూచించినా గవర్నర్ అందుకు అభ్యంతరం తెలిపారని ఈ సందర్బంగా గవర్నర్ ఆర్ఎన్ రవిపై భగ్గుమన్నారు ఎంకే స్టాలిన్.
పొన్ముడి పట్ల వ్యక్తిగత కక్ష సాధింపుతోనే గవర్నర్ వ్యవహరించారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రవి వచ్చినప్పటి నుంచి యుద్దం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. చివరకు తాము భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానాన్ని తప్పని స్థితిలో ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు సీఎం.
కానీ ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా, చట్టాన్ని అతిక్రమించాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు స్టాలిన్. ఆయన గవర్నర్ ను , కేంద్రంలో కొలువు తీరిన మోదీని, అమిత్ షాను ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీయేతర పార్టీలను, వ్యక్తులను , ప్రభుత్వాలను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు.