రైతన్నల కోసం ఆమరణ దీక్షకు సిద్ధం
బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో రోజు రోజుకు రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత , ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిట్ట నిలువునా మోసం చేసిందని వాపోయారు.
రూ. 2 లక్షలకు సంబంధించి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన సీఎం మాట మార్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయాలని , లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో అన్నదాతల కోసం నిరవధిక దీక్ష చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
రైతులను ఆదుకునే విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 31వ తేదీ వరకు గడువు ఇస్తున్నామని, ఆ లోపు రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని లేక పోతే ఆమరణ దీక్ష చేపడతామని స్పష్టం చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు రుణ మాఫీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం 60 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే మాఫీ జరిగిందని ఆరోపించారు.