నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
పాలమూరు జిల్లా – కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన స్వంత సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదన్నారు. ప్రభుత్వంలోని రెవెన్యూ శాఖలో అవినీతి చోటు చేసుకుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులే ప్రశ్నించాలా..నేను ప్రశ్నించ కూడదా అని ప్రశ్నించారు. బరాబర్ కచ్చితంగా ప్రశ్నిస్తా..నిలదీస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.
ప్రధానంగా రాష్ట్ర రెవిన్యూ శాఖలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువు తీరాక ఎక్కువ మంది సస్పెండ్ అయ్యారని, ఇది తన వల్లనే జరిగిందన్నారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
ఇదే సమయంలో తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని చెప్పిన చంద్రబాబు నాయుడు తిరుమల దర్శనం విషయంలో ఎందుకు తెలంగాణకు చెందిన భక్తులకు బ్రేక్ దర్శనం కల్పించడం లేదంటూ ప్రశ్నించారు. అత్యధిక ఆదాయం ఇక్కడి నుంచే తిరుమలకు వెళుతోందని అన్నారు. తాను తప్పు చేయనని, తనకు సంపాదించాల్సిన అవసరం లేదన్నారు అనిరుధ్ రెడ్డి.