మరోసారి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – ఎమ్మెల్యే దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైడ్రాపై మరోసారి నిప్పులు చెరిగారు. పేదల ఇళ్లు కూల్చుతామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అయితే పార్టీ ఫిరాయింపునకు సంబంధించి ఇప్పటి వరకు నోటీసు రాలేదన్నారు. వైఎస్ హయాంలో సైతం తాను ఎవరికీ బెదరలేదనని ఇప్పుడు ఎలా తల వంచుతానంటూ ప్రశ్నించారు. హైడ్రా దూకుడు తగ్గించుకుంటే మంచిదన్నారు. ఇలాంటి ఆఫీసర్లను చాలా మందిని చూశానన్నారు.
మంగళవారం దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. పేదల జోలికి వస్తే తాను సహించ బోనంటూ స్పష్టం చేశారు. ఆనాడే కాదు ఈనాడు కూడా తాను కాంప్రమైజ్ కాలేదన్నారు. తనపై ఇప్పటి వరకు 173 కేసులున్నాయని, అయినా భయపడే ప్రసక్తి లేదన్నారు.
తన ఇంట్లో ఇప్పటికీ మాజీ సీఎంలు వైఎస్సార్, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయంటూ బాంబు పేల్చారు. ఆ ఇద్దరంటే తనకు అభిమానమని, ఫోటోలు పెట్టుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు దానం నాగేందర్.
ఇదిలా ఉండగా తాను చెప్పినా పట్టించుకోకుండా హైడ్రా కూల్చి వేయడంపై ఆగ్రహంతో ఉన్నారు. సీఎంతో తాడో పేడో తేల్చుకుంటానని అన్నారు. కూల్చి వేతలు ప్రారంభిస్తే ముందు ఓల్డ్ సిటీతో ప్రారంభించాలన్నారు.