బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేగా సీఎంను కలవడంలో తప్పు లేదన్నారు.
తన నియోజకవర్గంలో 118 జీవో సమస్య ఉందన్నారు సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారైనా ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఉన్న సీఎంను కలువడం ప్రజాస్వామ్యంలో సంప్రదాయం అని స్పష్టం చేశారు. తాము కలిసినంత మాత్రాన పార్టీలో చేరుతున్నట్లు కాదని పేర్కొన్నారు సుధీర్ రెడ్డి.
ఇదిలా ఉండగా ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తమ సర్కార్ ను కూల్చుతామంటూ పదే పదే బెదిరిస్తూ వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమతో పెట్టుకుంటే సీన్ రివర్స్ కాక తప్పదన్నారు. తాను తల్చుకుంటే ఇప్పుడే బీఆర్ఎస్ ఖాళీ కాక తప్పదన్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. గులాబీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ ఇటీవలే జంప్ అయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.