ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్
అమరావతి – టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ నిప్పులు చెరిగారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులను మంగళవారం హైదరాబాద్ లో ఏపీ సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. విజయవాడకు తరలించింది విచారణ నిమిత్తం. గత వైసీపీ హయాంలో పీఎస్ఆర్ వైఎస్సార్ గా మారాడంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే. ఆనాడు అధికార అహంకారంతో వ్యవహరించాడని మండిపడ్డారు. ఆయన అరెస్టు చట్టానికెవరూ అతీతులు కారనేందుకు నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వంలో ఎసిబి డిజీగా , ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా, గతంలో తనతో విభేదాలున్న వ్యక్తులు, మహిళలను తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి వేధించారన్నారు.
ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. పీఎస్ఆర్ ఆంజనేయులు తన అపరిమితమైన అధికారాన్ని ఉపయోగించి ఎంతో మందిని బెదిరించి, తనకున్న అధికార పరిధిని దాటి అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎంతోమంది మహిళల కన్నీటికి కారకుడయ్యాడని మండిపడ్డారు. రాష్ట్ర యువతీ యువకుల భవిష్యత్తుని అంధకారం చేశాడని ధ్వజమెత్తారు. ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి పరీక్షా పత్రాలు అంశంలో అవకతవకలకు పాల్పడి ప్రతిభ ఉన్న విద్యార్థులకు కాకుండా పైరవీకారులకు పెద్దపీట వేసిన దుస్థితి గత ప్రభుత్వంలో చూశామన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడిన ఒక పోలీస్ అధికారిని మొదటి సారి రాష్ట్ర ప్రజలు చూశారన్నారు.