కాంగ్రెస్ మోసం రైతులకు శాపం – ఏలేటి
భగ్గుమన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన గాడి తప్పిందని, సీఎం ఒక మాట మంత్రులు మరో మాట మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ శాసన సభ పక్ష నేత , ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
ఎన్నికలకు ముందు ఆరు హామీలతో ఊదర గొట్టారని, చివరకు రైతులకు రుణ మాఫీ చేస్తామంటూ ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఎంపిక చేసిన రైతులకు , అర్హులైన వారికి ఇప్పటి వరకు రుణాలు మాఫీ కాలేదని వాపోయారు.
అసలు ప్రభుత్వం దగ్గర ఎంత మంది రైతులు రుణ మాఫీ కోసం ఉన్నారనే దానికి సంబంధించిన జాబితాను బయట పెట్టాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తంగా రుణ మాఫీ పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయాలని భావిస్తే వర్కవుట్ కాదన్నారు .
ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మంది రైతులకు రుణాలు మాఫీ చేసిందనే దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. మొత్తం రుణాలు మాఫీ కావాలంటే కనీసం 48,000 కోట్లు కావాల్సి ఉంటుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే.
కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.