నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కడియం
హైదరాబాద్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు. ఆయన బీఆర్ఎస్ పై భగ్గుమన్నారు. పదవి లేకుండా ప్రజలకు సేవ చేసే అలవాటు ఆ పార్టీ నేతలకు లేదన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా , ఎప్పుడు దొడ్డి దారిన అధికారంలోకి రావాలా అని ఆలోచిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఒక్కరోజు మీడియాలో, పత్రికల్లో కనిపించకపోతే వాళ్లకు బీపీ పెరుగుతుందంటూ ఎద్దేవా చేశారు. ఈ జబ్బు ఎక్కువగా కేటీఆర్, కవితలకే ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని కవిత ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న కవిత ఇప్పుడు చిలుక పలుకులు పలకడం పట్ల ఫైర్ అయ్యారు. ఎవరు ఏమిటనేది జనంలో తెలుసన్నారు. తాను ఏనాడూ పదవుల కోసం వెంట పడలేదన్నారు. కేసీఆర్ తనను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారని అన్నారు.
తాను లెక్చరర్ పదవికి రాజీనామా చేశానని, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు కడియం శ్రీహరి. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది ఎవరో తెలుసన్నారు. ప్రస్తుతం తమ ఫిరాయింపునకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందని, దానిపై తాను మాట్లాడాలని అనుకోవడం లేదన్నారు.