తెలుగు భాషను బతికించు కోవాలి
పిలుపునిచ్చిన మండలి బుద్ద ప్రసాద్
విజయవాడ – రాను రాను తెలుగు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్. తెలుగు జాతి ప్రకాశం, వికాసం కోసం రచయితలు రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నారని అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సభల వేళ రామోజీరావును స్మరించుకోవడం ఎంతో అవసరమన్నారు.
తన కళ్ల ముందు తెలుగు కనుమరుగు కాకూడదని కోరుకున్నారని కొనియాడారు. ప్రపంచ తెలుగు రచయితల సభలకు రామోజీరావు వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. 2011లో తెలుగు సభలకు ఆయన స్వయంగా హాజరయ్యారని గుర్తు చేశారు. తెలుగు కోసం తెలుగు వెలుగు పత్రికను నిర్వహించారని పేర్కొన్నారు.
తెలుగు భాష, తెలుగు జాతి పట్ల అపారమైన మమకారం ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ అంటూ ప్రశంసించారు. గతంలో హైదరాబాద్‌లో తెలుగులో న్యాయపాలన సదస్సు ఏర్పాటు చేశారని తెలిపారు. దాదాపు 70 తీర్పులు తెలుగులో రావడానికి కారణం జస్టిస్ ఎన్వీ రమణ అంటూ కితాబు ఇచ్చారు మండలి బుద్ద ప్రసాద్.
గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలుగులో విద్య గగనమై పోయిందని వాపోయారు. ఆంగ్లం భుజాన తుపాకీ పెట్టి తెలుగును కాల్చే యత్నాలను అడ్డుకోవాలన్నారు. ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చాల్సిన బాధ్యత రచయితలదేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమీ ప్రతిష్ఠను తగ్గించిందన్నారు.