కల్వకుంట్ల కుటుంబానికి అన్ని ఆస్తులు ఎక్కడివి..?
ఎమ్మెల్యే మందుల సామేల్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో అభివృద్ది పేరు చెప్పి దోచుకున్నది చాలదా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లు, విల్లాలు, భవంతులు, ఎకరాలు, ప్లాట్లు, ఫ్లాట్స్ ఎలా వచ్చాయో రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజానీకానికి చెప్పాలని డిమాండ్ చేశారు.
పదే పదే తమ సీఎంను టార్గెట్ చేసిన కేటీఆర్ కొడుకుకు 30 ఎకరాలు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు మందుల సామేల్. నువ్వు నీ బావమరిది హరీశ్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఆక్రమించుకున్నది ఎంతో చెప్పాలన్నారు. నీ చెల్లెలు కల్వకుంట్ల కవిత ఆస్తులు ప్రకటించాలని కోరారు మందుల సామేల్.
తెలంగాణ రాక ముందు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని..తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన , సమకూర్చుకున్న ఆస్తులు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. త్వరలోనే మీ బండారం బయట పడుతుందని కేటీఆర్ డ్రామాలు చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు అన్నీ తెలుసని, అవసరమైన సమయంలో బయట పడతారని చెప్పారు మందుల సామేల్.