ఎమ్మెల్యే ఔదార్యం బడికి విరాళం
మేడిపల్లి సత్యానికి జనం హ్యాట్సాఫ్
కరీంనగర్ జిల్లా – కాస్తంత అధికారం దక్కితే చాలు మిడిసి పడే రోజులు ఇవి. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఏకంగా తన నెల మొత్తం జీతాన్ని విరాళంగా అందజేశారు. ఆయన చేసిన సాయం పది మందికి మేలు చేకూర్చేలా ఉండడం విశేషం.
ఇదిలా ఉండగా తన మొదటి నెల జీతం నుండి రూ. 1,50,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
తాను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టానని, ప్రభుత్వ హాస్టల్ లో ఉండి చదువుకున్నానని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే. అంచెలంచెలుగా ఎదుగుతూ పీహెచ్ డీ వరకు చేశానని చెప్పారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు.
ఇటీవలే గంగాధర ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల అల్పహారం కోసం రూ. 30,000 అందజేశారు మేడిపల్లి సత్యం. భవిష్యత్తులో సైతం తాను పేద విద్యార్థులకు అండగా ఉంటానని, వారి చదువు కోసం ప్రయత్నం చేస్తానన్నారు.