ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా – ప్రజల కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక పోతోందని మండి పడ్డారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగామ జిల్లా ఎర్రగుంట తాండాలో మాజీ సర్పంచ్ తో పాటు 8 మంది వార్డు సభ్యులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్ చేశారని, అయినా బెదిరే ప్రసక్తి లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే.
ఇలా ఎంత కాలం అరెస్ట్ లతో, కేసులతో భయపెట్టాలని చూస్తారంటూ నిప్పులు చెరిగారు. ప్రజా పాలన పేరుతో రాచరిక పాలన సాగిస్తున్నారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఈనెలాఖరుకు జమ చేస్తామంటూ ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నాడని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైందని, ఇక కాంగ్రెస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని జోష్యం చెప్పారు. ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.