బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్
హైదరాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు పూర్తిగా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జీఎస్ఐ అధికారుల అనుమతి, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఎలా పనులు మొదలు పెట్టారంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు మృత దేహాలను వెలికి తీయక పోవడం దారుణమన్నారు. నీళ్లు వస్తున్నాయని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పనులను నిలిపి వేసిందని, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారంటూ ఫైర్ అయ్యారు.
మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. 4 సంవత్సరాల తర్వాత పనుల ఎస్టిమేట్ పెంచారని, కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. SLBC మీద రెండు వాగులు ప్రవహిస్తున్నాయని, .. ఆ వాగుల నీళ్లు టన్నెల్ లో ఊరుతున్నాయని గత ప్రభుత్వం పనులు ఆపేస్తే తమకు మేలు చేకూర్చేందుకు గాను పనులు ప్రారంభించారంటూ ఆరోపించారు పాయల్ శంకర్.
ఈ ప్రమాదం కాంగ్రెస్ సర్కార్ ముందు చూపుతో వ్యవహరించక పోవడం వల్లనే జరిగిందని, ఇందుకు పూర్తిగా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు భారీ ఎత్తున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.