రాజా సింగ్ హౌస్ అరెస్ట్
బాధితులపైనే దాడులు చేస్తే ఎలా
హైదరాబాద్ – ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉప్పల్ లోని చంగిచర్లలో హోళీ సందర్బంగా ఓ వర్గం దాడికి దిగింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ద రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
తాజాగా గురువారం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తాను చెంగిచర్ల వెళతానంటూ ప్రకటించడంతో ముందస్తుగా ఖాకీలు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్బంగా తనను ఎందుకు వెళ్లినీయడం లేదంటూ నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏమీ లేదన్నారు. పనిగట్టుకుని బాధితులపై కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు రాజా సింగ్. తాను ఎట్టి పరిస్థితుల్లోను వెళ్లి తీరుతానంటూ ప్రకటించారు. ఆయనను నచ్చ చెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.