రెడ్లదే రాజ్యం బీసీలకు మంగళం
హైదరాబాద్ – బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ పై సీరియస్ అయ్యారు. బీజేపీలో పదవులన్నీ రెడ్లకే ఇస్తే ఇక బీసీలు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. స్టేట్ ప్రెసిడెంట్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ రెడ్డి. మహిళా ప్రెసిడెంట్ రెడ్డినేనని చూద్దామంటే ఒక్కరు కూడా బహుజనులకు చెందిన వారు లేరని మండిపడ్డారు. తాజాగా రాజాసింగ్ చేసిన కామెంట్స్ రాష్ట్ర బీజేపీలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దీనిపై నోరు మెదప లేదు.
ఇదిలా ఉండగా పార్టీలో గత కొంత కాలం నుంచీ రాజా సింగ్ కీలకమైన కామెంట్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ కూడా అయ్యారు. ఇదే సమయంలో పార్టీ కార్యకలాపాలకు భంగం కలిగిస్తున్నాడనే నెపంతో బీజేపీ హైకమాండ్ ఆయనపై వేటు వేసింది.
చివరకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేసింది. ఇటీవల జరిగిన శాసన నభ ఎన్నికల్లో మరోసారి గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు సంబంధించి సిఫార్సు చేసిన ఏ ఒక్కరినీ నియమించక పోవడం పట్ల గుర్రుగా ఉన్నారు. తాను పార్టీలో ఉండాలా లేక రాజీనామా చేయాలా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీలో రెడ్డి వర్సెస్ బీసీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ తరుణంలో హైకమాండ్ సీరియస్ అయ్యింది రాజా సింగ్ పై. నోరు జర జాగ్రత్త అని హెచ్చరించింది. దీంతో తాను చేసిన కామెంట్స్ ను తొలగించారు ఎమ్మెల్యే.