హిందువుల జోలికి వస్తే సహించం
హైదరాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూపీలో జరుగుతున్న మహా కుంభ మేళాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఫైర్ అయ్యారు. దిగజారుడు కామెంట్స్ ఇక నుంచి చేయడం మానుకోవాలని సూచించారు. ఖర్గే వ్యాఖ్యలు లక్షలాది హిందూ భక్తుల మనోభావాలను కించ పరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. మహా కుంభ మేళా సాంస్కృతిక ప్రాముఖ్యను దెబ్బ తీస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి హిందువులంటే మొదటి నుంచి చులకన భావం ఉందని ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీని నామ రూపాలు లేకుండా చేశారని అన్నారు. అయినా బుద్ది రావడం లేదన్నారు రాజా సింగ్. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం ఆ పార్టీకే చెల్లిందన్నారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కోట్లాది మంది భక్తులు కుల, మతం, ప్రాంతం, జాతుల విభేదాలు లేకుండా పవిత్రమైన నదుల్లో పుణ్య స్నానం చేస్తున్నారంటూ పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఇప్పటికే రికార్డు స్థాయిలో భక్తులు స్నానం చేశారని చెప్పారు. దాదాపు 11 కోట్ల మందికి పైగా సందర్శించారని తెలిపారు.