ఎన్నికలయ్యాక బీఆర్ఎస్ ఖాళీ
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి అడ్రస్ లేకుండా పోతుందుని అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పోటీ కాంగ్రెస్ , బీజేపీ మధ్య మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వాపు చూసుకుని బలుపు అనుకుంటోందని ఎద్దేవా చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని మ్యాజిక్కులు చేసినా ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు యశస్విని రెడ్డి.
కాంగ్రెస్ , బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని పొరపాటుగా మాట్లాడటం జరిగిందని, దీనిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆ పార్టీకి చెందిన పింక్ సోషల్ మీడియా తనను టార్గెట్ చేయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు.
మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన దానిని జీర్ణించు కోలేక, వారికి ఏం చేయాలో అర్థం కాక ఇలా తప్పుడుగా మాట్లాడినట్టు వీడియోలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు.