నిలదీసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ – మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మెగాస్టార్ చిరంజీవిని వెనకేసుకు వచ్చారు. అద్భుతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు.
ఇదే సమయంలో మిగతా హీరోలను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి తప్ప ఎవరైనా ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్నారా అని నిలదీశారా అని ప్రశ్నించారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని ఏ హీరో అయినా అభిమానులకు ఏరోజైనా పిలుపునిచ్చారా అని నిలదీసే ప్రయత్నం చేశారు. చిరంజీవి ఒక్కరే బ్లడ్ బ్యాంక్ స్థాపించి కొన్ని లక్షల మందికి ఆసరాగా నిలిచాడని ప్రశంసలు కురిపించారు.
చిరంజీవి వారసులుగా చెప్పుకునే కొందరు కనీసం ఒక్క రూపాయి సహాయం చేశారా చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. వీళ్లంతా సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని అన్నీ గమనిస్తున్నారని అన్నారు.