నేతల ఆందోళన జీవన్ రెడ్డి ఆవేదన
ఇక పార్టీలో ఉండడం నా వల్ల కాదు
జగిత్యాల జిల్లా – కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తను ఉంటున్న పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉండాలో పోవాలో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందన్నారు. తన వారికే రక్షణ లేక పోతే ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తన ముఖ్య అనుచరుడైన 58 ఏళ్ల వయసు కలిగిన గంగి రెడ్డిని దారుణంగా హత్య చేశారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు రక్షిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో కలిసి జీవన్ రెడ్డి రోడ్డెక్కారు. ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తనకు మద్దతుగా నిలిచిన వారినే తాను రక్షించు కోలేని స్థితిలో ఉన్నానని, ఇక తనకు ఈ పదవి ఎందుకని, ఏదో ఒక స్వచ్చంధ సేవా సంస్థను పెట్టుకుని ప్రజలకు సేవలు అందిస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా తన పట్ల అనుసరిస్తున్న ధోరణిని ఆయన తప్పు పట్టారు. ఆయన చేసిన కామెంట్స్ సూటిగా సీఎంను ఉద్దేశించి ఉండడం గమనార్హం.