ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాలోని మామునూరుకు ఎయిర్ పోర్టు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పోరాటానికి స్పూర్తి దాయకంగా నిలిచిన రాణి రుద్రమ దేవి పేరు ఎయిర్ పోర్ట్ కు పెట్టాలని డిమాండ్ చేశారు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సర్కార్ పై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అధికారికంగా రాణి రుద్రమ దేవి పేరును ప్రకటించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ చరిత్రలో పోరాట స్పూర్తిని కలిగిన ఏకైక నాయకురాలు రాణి రుద్రమదేవి అని పేర్కొన్నారు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
కొన్ని ప్రదేశాలకు చారిత్రాత్మకమైన వ్యక్తుల పేర్లు పెట్టడం వల్ల సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, బుద్ది జీవులు ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమై పోయాయని ప్రశ్నించారు ఎమ్మెల్సీ.