ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్
కేటీఆర్, హరీశ్ కు షాక్
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ శుక్రవారం అరెస్ట్ చేసింది. ఆమె ఉపయోగించిన మొత్తం 16 ఫోన్లలను స్వాధీనం చేసుకుంది. 10 మంది సభ్యులతో కూడిన టీం ఇవాళ ఉన్నట్టుండి హైదరాబాద్ కు చేరుకుంది. ఇదే సమయంలో మోదీ కూడా పర్యటించడం విశేషం.
బంజారాహిల్స్ లో ఉన్న కవిత నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది ఈడీ. ఈ మేరకు రాత్రి 8.45 నిమిషాలకు ఢిల్లీకి విచారణ నిమిత్తం ఫ్లైట్ కూడా బుక్ చేసినట్లు ప్రకటించింది.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు. ఈడీ అధికారులతో వాగ్వావాదానికి దిగారు. కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఎలా తన సోదరిని అరెస్ట్ చేస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తమకు విశేషమైన అధికారాలు ఉన్నాయని, కవిత అక్రమాలకు పాల్పడిందంటూ తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయంటూ ఈడీ అధికారులు స్పష్టం చేశారు.