కవిత అరెస్ట్ తో కలకలం
హైదరాబాద్ – నిన్నటి దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకార పూరితంగా వ్యవహరిస్తూ వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని రీతిలో షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందో ఆనాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి గులాబీ బాస్ కు.
ఇదే సమయంలో నిన్నటి దాకా బీజేపీతో అంట కాగుతూ వచ్చిన బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగేలా ఝలక్ ఇచ్చింది కేంద్రం. ఆక్టోపస్ లా విస్తరించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న నేతలకు నిద్ర పోకుండా చేసింది కల్వకుంట్ల కవిత అరెస్ట్ వ్యవహారం.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. కానీ ఇదే కేసుకు సంబంధించి ఇంకా ఇద్దరు నేతలు మిగిలి ఉన్నారు. వారిలో ఒకరు కవిత కాగా ఇంకొకరు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
తాజాగా పక్కా వ్యూహంతో ఈడీ రంగంలోకి దిగింది. ఆ వెంటనే సెర్చ్ వారెంట్ అందజేసింది. కవితకు సంబంధించిన మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకుంది. అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ఆమె భర్త అనిల్ కుమార్ కు నోటీసు అందజేసింది. దీనిపై కేటీఆర్ అభ్యంతరం తెలిపినా వర్కవుట్ కాలేదు. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది ఈడీ వ్యవహారం.