అద్భుతంగా ఆడారంటూ కితాబు
హైదరాబాద్ – మలేషియా వేదికగా జరిగిన అండర్ -19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి కైవసం చేసుకోవడం పట్ల అభినందనలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళల జట్టు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. త్రిషకు మంచి భవిష్యత్తు ఉందన్నారు.
ఇదిలా ఉండగా వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. సఫారీ జట్టును 82 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా 11.2 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష 33 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లతో 44 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది. కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. బౌలింగ్ లోనూ ప్రతిభ చాటింది. 3 వికెట్లు తీసింది. ఇదిలా ఉండగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సఫారీలు భారత మహిళల బౌలర్ల దెబ్బకు విల విలలాడింది.
నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మికీ వాన్ ఒక్కరే టాప్ స్కోరర్ గా నిలిచింది. 23 రన్స్ చేసింది. విచిత్రం ఏమిటంటే ఆ జట్టులో నలుగురు ప్లేయర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టడం విశేషం. త్రిష అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటింది. పరునిక , ఆయుష్ , వైష్ణవి తలో 2 వికెట్లు తీయగా షబ్నం ఒక వికెట్ తీసింది.