NEWSNATIONAL

లిక్క‌ర్ స్కామ్ కేసులో కేసీఆర్ పేరు లేదు

Share it with your family & friends

ఖండించిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ

హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో రోజు రోజుకు ట్విస్ట్ ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ కోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో మాజీ సీఎం కేసీఆర్ కు తెలిసే జ‌రిగింద‌ని పేర్కొన్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

దీంతో మ‌రోసారి కేసీఆర్ వైర‌ల్ గా మారారు. దీనిపై తీవ్రంగా స్పందించింది భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ. బుధ‌వారం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన రాలేద‌ని పేర్కొంది. ఇలాంటి అవాస్త‌వాల‌ను ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావన చేసిందన్న ప్రచారం తప్పు అని కవిత న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. ఈడీ వాదనల్లో ఎక్కడ కూడా కేసీఆర్ ప్రస్తావన జరగలేదు అని తేల్చి చెప్పారు.

ఈ విషయంలో తప్పుడు వార్తలను ప్రచారం చేసిన మీడియా సంస్థలు వెంటనే ఆ వార్తలను డిలీట్ చేసి.. క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరింది బీఆర్ఎస్ పార్టీ.. లేని పక్షాన.. సదరు మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామ‌ని పేర్కొంది.