నా అరెస్ట్ సరే రేవణ్ణ సంగతేంటి..?
ఆయనను ఎలా దేశం దాటించారు
న్యూఢిల్లీ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంగళవారం ఢిల్ల లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితను ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగుస్తుంది. ఈ సందర్బంగా కోర్టు హాలులో కవిత మీడియాతో మాట్లాడారు.
కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కలిసి పోటీ చేస్తోంది. ఈ సందర్బంగా హసన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి రేవణ్ణపై కేసు నమోదైంది. ఈ ఇద్దరూ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగింది దర్యాప్తు సంస్థ. ఇప్పటికే తండ్రి ఎమ్మెల్యే రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించారు కవిత. ఆమె కేంద్ర సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారని, కానీ తమ లాంటి వారిని జైలులో పెట్టారంటూ ఆరోపించారు. తమ లాంటి వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.