కేసీఆర్ మొక్క కాదు వేగుచుక్క
కక్ష పూరితంగా కేసుల నమోదు
హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కావాలని కేసులు నమోదు చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. తామూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు కవిత.
కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి.. కేసీఆర్ ఒక వేగుచుక్క అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు కల్వకుంట్ల కవిత.
రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు కవిత.