అదానికో న్యాయం..ఆడ బిడ్డకో న్యాయమా..?
సంచలన వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుపాలై బెయిల్ పై విడుదలైన చాన్నాళ్లకు ఆమె స్పందించారు. గురువారం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగింది. ఈ అఖండ భారతంలో న్యాయం భిన్నంగా ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి కల్వకుంట్ల కవిత ప్రధానంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ దేశంలో న్యాయం కూడా భిన్నంగా ఉంటుందని పేర్కొనడం విస్తు పోయేలా చేసింది. అదానికో న్యాయం, ఆడ బిడ్డకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ ప్రస్తావన ఎన్నో ప్రశ్నలను లేవ దీసేలా చేసింది.
ఆధారాలు లేకున్నా ఆడ బిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం చాలా సులభం అన్నారు. అందుకే తనను అన్యాయంగా, అక్రమంగా జైలుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత. ఇదే సమయంలో ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఒక రకంగా మోడీ సర్కార్ ను నిలదీసినంత పని చేశారు.
ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .