ఎమ్మెల్సీ కోదండ రాం రెడ్డి కామెంట్
హైదరాబాద్ – ఎమ్మెల్సీ కోదండరాం షాకింగ్ కామెంట్స్ చేశారు. శాసన మండలిలో జాబ్స్ భర్తీ విషయంపై తీవ్రంగా స్పందించారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో నిర్బంధ పాలన కొనసాగిందే తప్పా జాబ్స్ భర్తీ చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం శుభ పరిణామమని అన్నారు. కేవలం మాయ మాటలతో నిరుద్యోగులను మోసం చేశారని వాపోయారు. దీంతో చాలా మంది ప్రతిభ కలిగిన యువత, నిరుద్యోగులు, అభ్యర్థులు తమ విలువైన కాలాన్నా కోల్పోవడం జరిగిందన్నారు.
ఇవాళ విద్యా రంగం వ్యాపారంగా మారి పోయిందని పేర్కొన్నారు కోదండ రాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల వరకు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆరోపించారు. నీళ్లు, నిధులు , నియామకాల కోసం ఏర్పడిన రాష్ట్రంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టలేదన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్. 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ సర్కార్ పట్టించు కోలేదని మండిపడ్డారు. అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారని, దొర అహంకారానికి చెక్ పెట్టారని చెప్పారు ఎమ్మెల్సీ. ప్రజలు అన్నింటినీ చూస్తున్నారని, వారికి సమయం వచ్చినప్పుడు ఓటుతో ప్రతాపం చూపిస్తారని చెప్పారు కోదండ రాం రెడ్డి.