నినదించిన బీసీ రాజకీయ యుద్దభేరి
వరంగల్ జిల్లా – హన్మకొండలో జరిగిన బీసీ యుద్దభేరి రణ నినాదం చేసింది. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయని తాజాగా నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మా కోటా మాకు దక్కేంత దాకా పోరాటం ఆపబోమంటూ స్పష్టం చేశారు. అతి తక్కువ శాతం ఉన్న రెడ్లు అధికారాన్ని చెలాయిస్తున్నారని, వారి ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. బీసీలను తక్కువ అంచనా వేయొద్దని, రెడ్లు, వెలమలు తెలంగాణకు చెందిన వారు కారంటూ ఆరోపించారు.
బిసిల జనాభా 60 శాతానికి పైగా ఉన్నా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వివక్ష నేటికీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వందుకు పైగా బీసీ కులాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, నేతలు ఈ యుద్దభేరి సభకు హాజరయ్యారు.
బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, తమిళనాడుకు చెందిన రాజ్యసభ సభ్యుడు విల్సన్, బిసి మండల్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంఎల్‌ఎసి బస్వరాజు సారయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ రవీందర్, జమాతే ఇస్లాం పార్టీ చీఫ్ జాఫర్, తదితరులు పాల్గొని ప్రసంగించారు.