కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రూ. 7 లక్షల కోట్లు అప్పు ఎలా అయ్యిందో చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కేసీఆర్ ను నమ్మి రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల భారం మోపాడని ఆవేదన చెందారు. ఇంత అప్పులు చేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను విడిచి పెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. తను చేసిన అప్పుల కుప్ప గురించి బయట పెట్టక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాములమ్మ.
శాసన మండలిలో నూతన ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయ శాంతి, శంకర్ నాయక్. మిత్రపక్షం నుంచి సత్యం కూడా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం విజయశాంతి అద్దంకి దయాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆరు నూరైనా సరే కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలి పెట్టబోమంటూ స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, రెండు మూడు పథకాల పేరుతో జనాన్ని మోసం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తోందని చెప్పారు విజయ శాంతి.