ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్
సత్తా బజార్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ – దేశంలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం తొలి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశమంతటా ఎన్నికల వేళ పండుగ వాతావరణం నెలకొంది. మరో వైపు భారీ ఎత్తున సర్వే సంస్థలు, మీడియా సంస్థలు గంప గుత్తగా తమ ఫలితాలను వెల్లడిస్తూ వస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీయే)కు ఢోకా లేదని పేర్కొంటున్నాయి.
గురువారం ప్రముఖ మీడియా సంస్థ సత్తా బజార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సర్వే వివరాలను వెల్లడించింది. ఆరు నూరైనా సరే మరోసారి బీజేపీ సత్తా చాటనుందని, తిరిగి మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఆసీనులు కావడం ఖాయమని జోష్యం చెప్పింది.
అయితే మోదీ ముందస్తుగా ప్రకటించిన విధంగా ఎన్డీయేకు 400 సీట్లు రావని పేర్కొంది. అయితే బీజేపీకి 331 సీట్లు వస్తాయని అంచనా వేసంది సత్తా బజార్. ఇక కాంగ్రెస్ పార్టీకి కేవలం 43 సీట్లు మాత్రమే వస్తాయని కుండ బద్దలు కొట్టింది.
ఇదిలా ఉండగా సదరు సంస్థ సర్వే ప్రకారం ఢిల్లీలో 7, గుజరాత్ లో 26, రాజస్థాన్ లో 25 , ఛత్తీస్ గడ్ లో 11 , ఉత్తరాఖండ్ లో 5 సీట్ల చొప్పున బీజేపీకి రానున్నాయని అంచనా వేసింది.