16న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
ప్రవేశ పెట్టనున్న కేంద్రం
ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 16న చరిత్రాత్మకమైన వన్ నేషన్ వన్ ఎలక్షన్ (ఒకే దేశం ఒకే ఎన్నిక) బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించింది. ముసాయిదా పూర్తయిందని, ఇక బిల్లు ఆమోదం పొందడమే మిగిలి ఉందని పేర్కొంది. అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశ పెడతారని తెలిపింది కేంద్రం.
ఇదిలా ఉండగా ఇండియా కూటమిలోని ప్రతిపక్షాలు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, ప్రధానంగా ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
ఇదే సమయంలో మోడీ ప్రభుత్వం రాచరిక పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు లోక్ సభలో ప్రతిపక్ష నేత , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ. ఈ బిల్లు వల్ల సమాఖ్య భావనకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోడీకే దక్కుతుందని ధ్వజమెత్తారు. ఇకనైనా తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. మొత్తంగా బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ లోని ఉభయ సభలతో పాటు దేశంలోని సగం రాష్ట్రాలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.