బాలకృష్ణ..అజిత్..శోభనకు కూడా
ఢిల్లీ – నందమూరి నట సింహానికి అరుదైన గౌరవం లభించింది. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. సినీ రంగానికి సంబంధించి దక్షిణాదిన తమిళనాడుకు చెందిన ప్రముఖ హీరో అజిత్ కుమార్, నటి శోభనతో పాటు నందమూరి బాలకృష్ణకు లభించాయి. ఈ సందర్బంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు బాలయ్యను అభినందనలతో ముంచెత్తారు.
నటుడిగా భిన్నమైన పాత్రలు పోషిస్తూ ముందుకు సాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. సినీ రంగంతో పాటు రాజకీయ పరంగా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుసగా ఆయన అనంతపురం జిల్లా హిందూపురం శాసన సభ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
అంతే కాకుండా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఆహాలో అత్యంత జనాదరణ పొందిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ప్రయోక్తగా ఉన్నారు. దేశంలోనే ప్రాంతీయ పరంగా అత్యంత పాపులర్ పొందిన కార్యక్రమంగా నిలిచింది. ఇది కూడా ఆయనకు అస్సెట్ అని చెప్పక తప్పదు.