చెరకు కొనుగోలు ధర పెంపు
8 శాతం పెంచిన కేంద్ర సర్కార్
న్యూఢిల్లీ – ఓ వైపు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని ఛలో ఢిల్లీ బాట పట్టారు రైతన్నలు. మరో వైపు ఓ రైతు కాల్పుల కారణంగా మరణించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ తరుణంలో రైతులను చల్ల బర్చేందుకు మోదీ సర్కార్ ప్లాన్ చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ఇందులో భాగంగా చెరకు పండించే రైతులకు తీపికబురు చెప్పింది. చెరకు కొనుగోలు ధర 8 శాతం పెంపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రభుత్వం తరపున తెలిపారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా మార్కెట్ లో చెరకు కింటాలుకు రూ. 315 పలుకుతోంది. ప్రస్తుతం పెంచిన కారణంగా ఆ ధర రూ. 340కి చేరుకుందని తెలిపారు. మొత్తంగా చూస్తే ఎనిమిది శాతం మేర పెరిగినట్టేనని పేర్కొన్నారు.
తాము రైతులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని కానీ వారే అర్థం చేసుకోవడం లేదంటూ ఆవేదన చెందారు కేంద్ర మంత్రి. మొత్తంగా చెరకు ధర పెంచితే ఏం లాభమని, మిగతా పంటలకు కూడా కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు రైతన్నలు.