మొఘల్ -ఎ- ఆజం కు 64 ఏళ్లు
ఆగస్టు 5తో పూర్తి చేసుకున్న మూవీ
హైదరాబాద్ – భారత సినీ చరిత్రలో చిరస్మరణీయమైన మైలురాయిగా నిలిచి పోయింది మొఘల్ – ఎ – అజం . ఈ సినిమా విడుదలై ఇవాల్టితో ఆగస్టు 5తో 64 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. అద్భుతమైన ప్రేమ కథకు దృశ్య రూపం ఇచ్చిన వైనం ఎల్లప్పటికీ కళ్లల్లో కదలాడుతూనే ఉంటుంది.
ప్యార్ కియా తో డర్నా క్యా అంటూ సాగిన ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ కోట్లాది హృదయాలను వెంటాడుతూనే ఉంటుంది. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మూవీస్ లలో మొఘల్ -ఎ – అజం ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే.
దిలీప్ కుమార్, మధు బాల, పృథ్వీరాజ్ కపూర్, దుర్గా ఖోటే నటించారు. అత్యుత్తమ సంగీతం, అత్యంత ఆకర్షణీయమైన డైలాగ్ లు గుండెలను పిండుతాయి. తరాలు మారినా చెక్కు చెదరకుండా ఉండి పోయింది మొఘల్ -ఎ – ఆజం. ఆగస్టు 5, 1960లో దేశ వ్యాప్తంగా విడుదలైంది ఈ చిత్రం. సినిమాటోగ్రఫీ ఆర్డీ మాథుర్ అందిస్తే..నౌషాద్ వీనుల విందైన సంగీతం అందించాడు. మొత్తం మూవీ నిడివి 197 నిమిషాలు.
మొఘల్ – ఎ – ఆజం ( ది గ్రేట్ మొఘల్ ) చిత్రాన్ని కె. ఆసిఫ్ నిర్మించి..దర్శకత్వం వహించాడు. భారతీయ పురాణ చారిత్రక నాటక చిత్రం. మొఘల్ యువ రాజు సలీం ..నర్తకి అనార్కలీ మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ మూవీ.
సలీం తండ్రి అక్బర్ చక్రవర్తి. వీరిద్దరి సంబంధాన్ని తను అంగీకరించ లేదు. చివరకు తండ్రీ కొడుకుల మధ్య యుద్దానికి దారి తీస్తుంది. అక్బర్ నాటి పాలనలో ఉన్న నాటక రచయిత ఇంతియాజ్ అలీ తాజ్ రచించిన అనార్కలీ అనే నాటకాన్ని చదివాడు ఆసిఫ్. ఆ తర్వాత సినిమాగా తీయాలని భావించాడు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య చిత్రాన్ని తీశాడు. బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ప్రేమ దృశ్య కావ్యంగా ఈ సినిమా నిలిచి పోయింది.
ఇక నౌషాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన శక్తినంతా ఈ సినిమా కోసం ఉపయోగించాడు. భారతీయ శాస్త్రీ, జానపద సంగీతానికి పెద్ద పీట వేశాడు. మహమ్మద్ రఫీ, శంషాద్ బేగం, బడే గులాం అలీ ఖాన్ తో పాటు లతా మంగేష్కర్ లతో పాటలకు ప్రాణం పోశాడు. మొత్తం 12 పాటలు ఉన్నాయి. ప్రతి పాట దేనికదే ప్రత్యేకం.
విడుదలైన తర్వాత మొఘల్ – ఎ – ఆజమ్ కోసం జనం బారులు తీరారు. సినిమాను ఊహించని దానికంటే ఆదరించారు. 15 ఏళ్ల పాటు ఈ చిత్రం నిరంతరాయంగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. బాక్సులను బద్దలు కొట్టింది. ఎన్నో అవార్డులు..మరెన్నో ప్రశంసలు..పురస్కారాలు దక్కాయి. నవంబర్ 12, 2004లో కలర్ లో రిలీజ్ చేశారు. అది కూడా వసూళ్లలో రికార్డు సృష్టించింది.